eknazar - desi lifestyle portal
Global
Advertise | Contact Us
My Account
FunAsia MindsMapped Big Banner


News

TANTEX 114 Nela Nela Telugu Vennela
Date: Jan 20 2017 Submitted By:  

భావకవిత్వంతో రసమయంగా సాగిన 114వ టాంటెక్స్ సాహిత్య వేదిక సదస్సు

జనవరి 15, 2017, డాలస్, టెక్సస్

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో "నెలనెలా తెలుగు వెన్నెల" సాహిత్య సదస్సు ఆదివారం జనవరి 15వ తేదీన దేశీప్లాజా టీవీ స్టూడియోలో సాహిత్యవేదిక సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ అధ్యక్షతన ఘనంగానిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 114 నెలలపాటు ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్యసదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషం. డాలస్ లోని భాషాభిమానులు,సాహిత్యప్రియులు అధిక సంఖ్యలో ఈ సమావేశానికి విచ్చేసి సభను జయప్రదం చేసారు.

బిళ్ళా ప్రవీణ్ సభను ప్రారంభిస్తూ 114వ నెలనెలా తెలుగు వెన్నెల సదస్సుకి విచ్చేసిన సాహితీప్రియులకు స్వాగతం పలికారు. సభకు 2017 సంవత్సరానికి సమన్వయకర్తగా శ్రీమతి శారద సింగిరెడ్డి గారిని పరిచయం చేస్తూ వేదిక మీదికి ఆహ్వానించారు. తెలుగుసాహిత్యవేదిక సమన్వయకర్తగా రెండవసారి పదవీబాధ్యతలను స్వీకరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని శ్రీమతి సింగిరెడ్డి శారద తెలియజేసారు. కార్యక్రమంలో ముందుగా చిరంజీవి కమ్మంకర్ శ్రీతన్ ప్రార్థనా గీతాన్ని ఆలపించాడు. తాను భగద్గీత నేర్చుకుంటున్నానని, మొదటి ఎనిమిది అధ్యాయాలలో అధ్యాయం పేరు చెప్పి ఎన్నోపద్యం అడిగినా, పద్యాన్ని అప్పజెప్పగలను అని అడిగిన అన్నీ తడుముకోకుండ చక్కగా చెప్పగలిగాడు. పూర్తిగా పారాయణం చేయడం వచ్చిన తరువాత అర్ధం కూడా తెలుసుకుని ఆచరించే దిశగా శిక్షణ, స్థానిక హిందూదేవాలయంలో పొందుతున్నట్లుగా చిరంజీవి తండ్రి తెలియజేసారు. చిన్నారి చెబుతుంటే తనకు ఐదవతరగతిలో పోటీ కోసం నేర్చుకున్న భగవద్గీతలోని శ్లోకం గుర్తుకు వచ్చిందని, సాహిత్యాభిమాని డా. ఇస్మాయిల్ పెనుకొండ లేచి వినిపించి తన ఆనందాన్ని వ్యక్తం చేసారు.

గతంలో నెలనెలా తెలుగువెన్నెల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీ పిస్కా సత్యనారాయణ గారు, ఈ కార్యక్రమంలో ద్వాపరయుగంలోని శ్రీక్రిష్ణుడిని, కలియుగంలోని శ్రీక్రిష్ణదేవరాయలని అనుసంధానిస్తూ కొన్ని పద్యాలను ఉదహరిస్తూ మాట్లాడారు. సాహిత్యవేదిక సభ్యులు డా. కలవగుంట సుధ గారు క్షేత్రయ్య పదసాహిత్యం పై మాట్లాడుతూ అష్టావిధ నాయికల వర్ణన అభినయించారు. శ్రీ మద్దుకూరి చంద్రహాస్ గారు 'నేనొక ప్రేమ పిపాసిని ' అనే సినిమా పాటలో మొదటి రెండు చరణాలు ఎక్కువ ప్రజాదరణ చెంది ప్రాచుర్యంలో ఉన్నప్పటికి, మూడవ చరణంలో ఎంత అందమైన సాహిత్యం దాగిఉందో వివరించారు. శ్రీ జువ్వాడి రమణ గారు శాతవాహనులకి ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయానికి సంబంధించిన వివరాలను వివరించారు. శ్రీ వేముల లెనిన్ గారు కొన్ని నన్నయ పద్యాలను పంచుకున్నారు.

ప్రతి ఆదివారం సాయంత్రం ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం సమర్పించే టాంటెక్స్ తరంగిణి కార్యక్రమం తెలుగు వన్ రేడియో ద్వారా 3 గంటల నుండి 5 గంటల వరకు సాగుతుంది. ఈ కార్యక్రమానికి శ్రీనివాసులు మరియు పరిమళ రేడియోవ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తూ 114వ నెలనెలా తెలుగు వెన్నెల సదస్సుని దేశీ ప్లాజా స్టూడియో నుండి టాంటెక్స్ తరంగిణిలో తెలుగు వన్ రేడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేసారు.


114వ నెలనెలా తెలుగు వెన్నెల సదస్సుకి ముఖ్య అతిథిగా విచ్చేసిన డా. ఆళ్ళ శ్రీనివాస రెడ్డి గారిని పరిచయం చేస్తూ శ్రీ ఎం. వి. ఎల్. ప్రసాద్ వేదిక మీదకు ఆహ్వానించగా, డా.సి.ఆర్.రావు , కలవల రావు గార్లుఅతిథికి పుష్పగుచ్చం అందచేసారు.

డా. ఆళ్ళ శ్రీనివాస రెడ్డి గారు "జానపదం మరియు భావకవిత్వం" పై ప్రసంగించారు. దాదాపు తొంభై నిముషాల పాటు సాగిన ప్రసంగంలో "కోడిబాయె లచ్చమ్మ" దగ్గర మొదలై, సందర్భానుసారంగా జానపదంలో వేర్వేరు ప్రాంతాల యాసలను, ఆయా పాటల లక్షణాలను వివరిస్తూ, ఎన్ని బాణీలు వేర్వేరు కవులు, రచయితల కలాలనుండి వెలువడ్డాయో పాడి వినిపించారు. ఒకే పాట వయసుతో పాటు మనం పాడే విధానం ఎలా మారుతుందో ఒకటిరెండు ఉదాహరణలు పాడి వినిపించారు. దేవులపల్లి, దాశరధి, దేవరకొండ బాలగంగాధర తిలక్, నండూరి వారి ఎంకి, దేశభక్తి గేయాలు, పాటలు, కవితలు, పద్యం ఇలా అన్ని రకాల జానపద సాహిత్యాన్నీ స్పృశిస్తూ ముగిసింది.

2016 సంవత్సారానికి సంస్థ అధ్యక్షులుగావ్యవహరించిన జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నెల నెలా తెలుగు వెన్నెల సదస్సుల కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన 2016 సాహిత్య వేదిక బృంద సభ్యులను , సమన్వయకర్తనుఅభినందిస్తూ, క్రొత్త బృందాన్నిఈకార్యక్రమాలనుమరింత ముందుకు తీసుకువెళ్లాలని కోరారు.అధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల చరిత్రగల సంస్థకు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం తన అదృష్టంగా భావిస్తున్నాను అని తెలుపుతూ, రాబోయే కార్యక్రమాల గురించి తెలిపారు.

ముఖ్య అతిథిని ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి మరియు పాలకమండలి అధిపతి రొడ్డ రామకృష్ణ రెడ్డి గార్లు శాలువాతో మరియు కార్యక్రమ సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ మరియు సాహిత్య వేదిక బృంద సభ్యులు జ్ఞాపిక తో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్)ఉత్తరాధ్యక్షులుశీలం క్రిష్ణవేణి , ఉపాధ్యక్షులు వీర్నపు చినసత్యం, కోశాధికారి గోవాడ అజయ్, సంయుక్త కోశాధికారి మండిగ శ్రీలక్ష్మి, పాలకమండలి సభ్యులు కన్నెగంటి చంద్ర, కార్యవర్గ సభ్యులు డా.ఊరిమిండి నరసింహారెడ్డి, దండ వెంకట్, సింగిరెడ్డి శారద, పార్నపల్లి ఉమామహేష్, తోపుదుర్తి ప్రభంధ్,లంకా భానుఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ సాహిత్యం మీద ప్రేమ, మాతృ భాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభి మానులకు, సాహితీ ప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి మరియు ప్రసార మాధ్యమాలైన టోరి , టి.ఎన్.ఐ లకు కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేసారు.

కార్యక్రమంలోని ఛాయాచిత్రాలను ఈ లంకెలో చూడవచ్చును.

టాంటెక్స్ 114వ నెల నెలా తెలుగు వెన్నెల సదస్సు గురించి అట్లూరి స్వర్ణ సమర్పించిన నివేదిక.


Note: Local Community News is posted by our users. EkNazar.com is not responsible for the accuracy, errors/omissions of Local Community News.
Please see our full Terms of Use.

Cosmos Big Banner Indian Astrologer World Famous
© 2000-2018. All rights reserved eknazar.com
Legal  |   Privacy  |   Advertise   |   Contact Us